మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్పై మరో కేసు

-

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపింది రాహిల్ అని తాజాగా నిర్ధారించిన పోలీసులు అతడు నిందితుడిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.

2022 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ ముగ్గురు మహిళలు ఓ పసికందుతో డివైడర్‌ దాటుతుండగా ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడగా చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కారులోని ముగ్గురు యువకులూ పరారయ్యారు. ఆ వాహనంపై అప్పటి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేయగా.. అప్పట్లో కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్‌ అనే యువకుడు పోలీసుల ముందు లొంగిపోయి కారులో తనతోపాటు రాహిల్‌, స్నేహితుడు మహమ్మద్‌ మాజ్‌ ఉన్నట్లు అంగీకరించాడు. దీంతో ఆ ఇద్దరి పేర్లనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

 

గత ఏడాది డిసెంబరులో ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్‌ ప్రమాదం కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లోనూ కారు నడిపింది రాహిల్‌ అని, ప్రమాదం జరగ్గానే పరారై తన స్థానంలో ఆఫ్రాన్‌ను ఉంచినట్లు పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టి వాహనం నడిపింది రాహిల్‌ అని నిర్ధారణకు వచ్చి దర్యాప్తు పునఃప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version