నేడు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ చరిత్ర ఘనమైనదని అన్నారు. దక్షిణ భారతం నుండి ఏకైక ప్రధాని పీవీ నరసింహారావేనని.. ఆయన తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు బండి సంజయ్.
పీవీ ప్రధాని కావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. దేశ వ్యాప్తంగా పీవీ జయంతులు జరుగుతున్నాయని.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఆయనకు నివాళులు అర్పించకపోవడం పట్ల బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆనాడు పీవీ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని.. దహన సంస్కారాలు కూడా చేయలేక పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాడు అవమానిస్తే.. కెసిఆర్ ఈరోజు పీవీని అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీని స్మరించిన కెసిఆర్ కి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు.
కెసిఆర్ పక్క పొలిటీషియన్ అని అన్నారు బండి సంజయ్. ఆయనకు ఓట్ల సమయంలోనే కులాలు, నాయకులు గుర్తుకు వస్తారని అన్నారు. ఓట్లు దండుకొవడం ఎలాగో కెసిఆర్ కు బాగా తెలుసన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలకు వందకోట్లను ఖర్చు పెడతామని ప్రకటించిన కేసీఆర్ ఒక్క కోటి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కెసిఆర్ కాదు కెసిఆర్ కింద ఉన్న కుర్చీకి విలువ ఇస్తున్నామన్నారు. పీవీకి భారతరత్న కావాలని ఇప్పుడు కాదు కెసిఆర్ ఎన్నికలప్పుడే అడుగుతాడని ఎద్దేవా చేశారు.