తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో మొత్తం 1,241 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శుక్రవారం ప్రకటన జారీ చేసింది.
కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీల ఖాళీలను తాతాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కోసం అర్హత, ఆసక్తిగల అభ్యర్థులను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. కేజీబీవీల్లో పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొంది. ఈ నెల 26 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులైలో రాతపరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీ దేవసేన తెలిపారు. విద్యార్హతలు, రాతపరీక్ష సిలబస్, అభ్యర్థుల ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలతో ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.