తెలంగాణలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పంటల సాగు సాధారణ లక్ష్యాన్ని అధిగమించింది. ఏకంగా 1,25,05,641 (100.62) ఎకరాల్లో రైతులు పంటలు వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. గతేడాది కంటే ఈసారి దాదాపు ఆరు లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందని తెలిపింది. 18 జిల్లాలు 100 శాతానికి పైగా సాగు లక్ష్యాన్ని అధిగమించాయని వెల్లడించింది.
ఇక రాష్ట్రంలో వరి సాగు విషయానికి వస్తే.. 49,86,634 ఎకరాల సగటుకు గాను 63,55,986 ఎకరాల (127.46 శాతం)లో నాట్లు పడ్డాయి. పత్తి 45,00,475 ఎకరాలు (88.96 శాతం) సాగవుతోందని వ్యవసాయశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, పప్పు దినుసులు, సోయాబీన్, పత్తి సాగు ముగియగా.. మరికొద్ది రోజులు వరినాట్లు, కొన్ని మెట్ట పంటలు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబాబాద్, జనగామ, నల్గొండ, భద్రాద్రి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, యాదాద్రి వంద శాతం లక్ష్యాన్ని అధిగమించాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.