ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది తమ ఇష్టమని.. నామినేషన్ చివరి వరకూ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆలస్యంగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికను ఇప్పటికే 50 శాతం వరకు పూర్తి చేశామని వెల్లడించారు. సికింద్రాబాద్లో నాలుగు రైల్వే సర్వీసులను జెండా ఊపి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
‘ఇప్పటికే రెండు సార్లు ప్రధాని తెలంగాణకు వచ్చారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు త్వరలో ప్రచారానికి వస్తారు. ఇప్పటికే అనేకమంది బీజేపీలో చేరుతున్నారు. మా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల రైలు ప్రారంభం సందర్భంగా రైల్వే సిబ్బందిని అవమానించారు. సీఎం కుంటుంబసభ్యులు రైల్వే సిబ్బందిని అవమానించారు. రాష్ట్రంలో రైల్వే కోసం కేంద్రం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. హైదరాబాద్‌కు కొత్త రైల్వే టెర్మినల్ వస్తోంది. జనవరిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం ఇస్తాం. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌లో కొత్త మార్గాలను వేగంగా పూర్తిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తాం.’ అని కిషన్ రెడ్డి తెలిపారు.