తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని మండిపడ్డారు. దిల్లీ మద్యం కేసులో ఈడీ దర్యాప్తును పక్కదారి పట్టించారని ఆరోపించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. కేసీఆర్ స్పందనపై తాజాగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
దిల్లీ మద్యం కేసులో సాక్ష్యాలు ఉన్నాయి. దిల్లీ మద్యం కేసులో మీ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? మద్యం పాలసీలో దిల్లీలోని ఆప్ ప్రభుత్వం అవకతవకలు చేసింది. కేసీఆర్‌కు సవాలు విసురుతున్నా. దిల్లీ మద్యం కేసులో అక్రమాలను సాక్ష్యాలతో నిరూపిస్తాను. కేజ్రీవాల్ తప్పు లేదని కేసీఆర్ నిరూపించగలరా? కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు.