తెలగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు జాతీయ నేతలను రంగంలోకి దింపి ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం సారధి కేసీఆర్ సహా.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ కేసీఆర్ భరోసాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందులో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు.
రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ కేసీఆర్ భరోసాను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు చెబుతున్నారు. హస్తం పార్టీకి రాష్ట్రంలో ఛాన్స్ ఇస్తే.. మళ్లీ అంధకారం అలుముకుంటుందని పదే పదే ప్రజలకు వివరిస్తున్నారు. రైతులు ఎరువులకు, విత్తనాలకు లైన్లు కట్టే రోజులు మళ్లీ వస్తాయని నొక్కి వక్కాణిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం రోజున చౌటుప్పల్, మునుగోడులో పర్యటించిన మంత్రి.. ఇవాళ హుజుర్‌నగర్, దేవరకొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. మంత్రి పర్యటనకు స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.