టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై గత కొన్నిరోజులుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ ఇద్దరికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు చేసిన ఆరోపణలపై వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
తన న్యాయవాది ద్వారా కాంగ్రెస్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ఇద్దరు టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లు 499, 500 ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించినట్లు కేటీఆర్ తెలిపారు.