రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు రూ.70 కోట్లకుపైగా నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.5 కోట్లతో మహబూబాబాద్ నుంచి ఈదుల పూసపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మరో 5 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడ్రన్ మార్కెట్‌ను ప్రారంభించనున్నారు.
కోటి రూపాయలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 10 కోట్లతో నిర్మించిన 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,181 మంది రైతులకు 67,730 ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. 1,51,146 మంది రైతులకు ఈరోజు పోడు భూముల పట్టాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీకి ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు.