పీవీ నరసింహారావు అంటే తెలంగాణకు గర్వకారణం అన్నారు కేటీఆర్. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మరియు పార్టీ సీనియర్ నాయకులు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… అసమాన్యమైన తెలివితేటలతో తన బహుభాషా ప్రజ్ఞ పాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పీవీ గారు… ఒక కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణశీలిగా పీవీ గారిని చరిత్రను దేశం ఎన్నడు మర్చిపోదని తెలిపారు.
భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు… తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆర్థికంగా అతలాకుతులమై ప్రమాదం అంచున ఉన్న దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కాపాడగలిగారు… పీవీ నరసింహారావుకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారన్నారు. రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థిక వేత్తను తీసుకువచ్చి.. ఆర్థిక మంత్రిగా నియమించుకొని అద్భుతంగా ఆర్థిక సంస్కరణలను చేపట్టారు…16 భాషల్లో అద్భుతమైన భాషా ప్రావీణ్యం ఉన్నా కొన్నిసార్లు, తన మౌనమే తన భాషగా గొప్ప పాలన నిర్వహించారని వివరించారు. తన సొంత 800 ఎకరాల కుటుంబ భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించారన్నారు.