ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పాదయాత్ర పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేశారు. సీఎం గారు..పుండు ఓ చోటైతే.. మందు ఓ చోట.. అన్నట్టుగా ఉంది మీ పాదయాత్ర తీరు ఉందని చురకలు అంటించారు. మీ మూసీ ప్రాజెక్టు బాధితులు ఉన్నదెక్కడ ? మీరు పాదయాత్ర చేస్తున్నదెక్కడ ? అంటూ నిలదీశారు. వేల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే స్కెచ్ గీసి… లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్లాన్ వేసి…. దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర పేరిట డ్రామా చేస్తారా ? అని నిలదీశారు.
లక్షలాది మంది ఆక్రందనలకు కేరాఫ్ గా మారిన.. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం, చిత్తశుద్ధి మీకుందా ? అంటూ సవాల్ విసిరారు. అసలు మూసీని మురికికూపంగా మార్చింది..మీరు ఊరేగిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలేనన్నారు. దశాబ్దాలపాటు దరిద్రమైన వ్యర్థాలు కలుస్తుంటే..అరవై ఏళ్లు అటువైపు కళ్లుండీ చూడని కబోదులు మీరు అంటూ ఆగ్రహించారు. కనికరం లేకుండా కాల్చిచంపిన దోషులే.. సంతాప సభకొచ్చి కన్నీరు కార్చినట్టుంది.. మీరు నిస్సిగ్గుగా చేపట్టిన పాదయాత్ర తీరు అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. మీరు చేయాల్సింది.. పాదయాత్ర కాదు..ఆ రైతులను క్షమాపణలు కోరుతూ మోకాళ్ల యాత్ర చేయాల్సింది అంటూ సెటైర్లు పేల్చారు.