నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ ప్రమాదకర మార్గం : కేటీఆర్

-

రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉందని మండిపడ్డారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని మీడియాలో కథనాలు వస్తున్నాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉంది. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి?’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version