GHMCలో కంటోన్మెంట్‌ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్​ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్​ను విలీనం చేస్తే ఎస్సార్డీపీ ,ఇతర పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని ట్వీట్ చేశారు. స్కైవేల నిర్మాణం కోసం కొంత భూమి ఇవ్వాలని ఏడేళ్ల నుంచి కోరుతున్నా కేంద్రం మొండిగా నిరాకరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

జనావాసాలను కంటోన్మెంట్ నుంచి తొలగించి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. రక్షణశాఖ మరో అదనపు కార్యదర్శి, తెలంగాణ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కంటోన్మెంట్స్ అదనపు డీజీ, దక్షిణ కమాండ్ డైరెక్టర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు, సీఈఓలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కంటోన్మెంట్ నుంచి తొలగింపు, భూములు, స్థిరాస్థులు, బోర్డు ఉద్యోగులు, పెన్షనర్లు, నిధులు, పౌరసేవలు, చరాస్థులు, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్, రికార్డులు తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version