ఓ బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటుండగా అక్కడికి ఓ కోడిపుంజు వచ్చింది. కాసేపు దాంతో ఆడుకుని వెంటనే అమాత్తం కోడిపంజును పట్టేసుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి ఎవరిదని అడిగారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో దొంగిలించాడని భావించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు ఆ పోలీసులు ఏం చేశారంటే..?
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పురపాలిక పరిధి బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ బాలుడు కోడిపుంజును తీసుకెళ్తుండగా.. గమనించిన స్థానికులు చోరీ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది వచ్చి బాలుడితో పాటు కోడిపుంజును ఠాణాకు తీసుకెళ్లారు. నిందితుడు మైనర్ కావటంతో తల్లిదండ్రులకు పిలిపించి వారికి అప్పగించారు. కోడిపుంజు ఎవరిదో తెలియకపోవడంతో.. ఎవరి నుంచీ ఫిర్యాదు రాకపోవడంతో..బయట ఉంటే కుక్కలు దాడిచేసే అవకాశముందని భావించి కోడిపుంజును లాకప్‌లో పెట్టారు. దానికి గింజలు, నీరు ఏర్పాటు చేయించారు సీఐ రమేశ్‌బాబు. ఠాణాకు వెళ్లినవారంతా లాకప్‌లో ఉన్న కోడిపుంజును ఆసక్తిగా చూశారు. సీఐని వివరణ కోరగా భద్రత కల్పించేందుకే లాకప్‌లో పెట్టినట్లు చెప్పారు.