తెలంగాణ శాసనసభ సమావేశాలు గురువారం రోజున ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే శాసనసభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో మాత్రం రాష్ట్రంలో వర్షాలు-వరద నష్టాల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే శాసన మండలి సమావేశాల్లో గురువారం వర్షాలపై నిర్వహించిన చర్చలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీనని.. మొదటిసారిగా మాట్లాడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు.
‘‘నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీని. మొదటిసారి మాట్లాడుతున్నా. చాలా చిన్నవాణ్ని. డ్రైవర్‌గా పనిచేసేవాడిని. దీన్ని ఒప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదు. అల్లా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేనేదో పెద్దవాడిని అయ్యానని భావించను. ప్రజల మనిషిని. వారితో కలిసి ఉంటాను. ప్రాణాలున్నంతవరకు వారికి సేవ చేస్తాను. పాతబస్తీలో వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి. విద్యుత్తు సిబ్బంది సంఖ్యను పెంచాలి’’ అని ఎమ్మెల్సీ రహమత్ బేగ్ ప్రభుత్వాన్ని కోరారు.