రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి తన సొంత నియోజకవర్గం నల్గొండ కన్నా తనకు రాజకీయ దశ దిశను చూపిన నకిరేకల్ పైనే ప్రేమ, అభిమానం ఎక్కువ ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణ కేంద్రంలో బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యజించి తెలంగాణ వెంకన్న గా పేరుపొందిన మంత్రి వెంకటరెడ్డి నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడన్నారు. ఈ నియోజకవర్గంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తే నకిరేకల్ నియోజకవర్గానికి 62 వేల ఎకరాల భూమి సాగు అవుతుందని అలాగే నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి 20వేల ఎకరాల భూమి సాగు అవుతుందన్నారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే 100 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి కోసం 100 కోట్లు మంజూరు చేశారని అలాగే యిపల్లి, ధరా రెడ్డి పల్లి కాల్వల పూర్తి కోసం నిధులను మంజూరు చేయించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.