రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లోనూ బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా పోడు భూముల అంశం తెరపైకి రావడంతో సభ్యులు ఈ అంశంపైన మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎస్టీలకు పోడుభూముల చట్టం ద్వారా 2006లో లబ్ధి కలిగించామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీలకు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేయలేదని మండిపడ్డారు.
తమ పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని గులాబీ నేతలను డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్న సీతక్క.. తన తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడు భూముల హక్కు వచ్చిందని.. అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు తమవి అని పేర్కొన్నారు. సంప్రదాయంగా తమకు వచ్చిన హక్కు అది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. పోడు భూముల పంపిణీలో గత ప్రభుత్వం అందరికీ న్యాయం చేసిందని చెప్పారు. గిరి వికాస్ పథకం కింద అన్ని ఎస్టీ కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చామని వెల్లడించారు.