గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతల చుట్టూ వివాదాలు బిగుసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నేతల ఎన్నికపై కోర్టులు కీలక ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.
మంత్రితో పాటు చీఫ్ ఎలక్షన్ అధికారి రాజీవ్‌కుమార్, రోనాల్డ్ రోస్ ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్, కేంద్ర ఎన్నికల అధికారి సంజయ్‌కుమార్, మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, వెంకటేశ్ గౌడ్, నోటరీ అడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్, దానం సుధాకర్‌లపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగుతుండగా.. నాంపల్లిలోని ఈ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. విచారించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా.. రాష్ట్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టారు. శ్రీనివాస్‌గౌడ్ 2018 నవంబరు 19న దాఖలు చేసిన.. అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపడతామని తెలిపారు. దీనికి సంబంధించి విచారించాల్సిన సాక్షుల వివరాలు, సాక్ష్యాలను సమర్పించాలని పిటిషనర్ సీహెచ్ రాఘవేంద్రరాజును ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది.