కొబ్బరి సాగుపై కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం కొరకు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగినదని వివరించారు తుమ్మల. మన తెలంగాణ రాష్ట్రంలో 27 జిల్లాలలో మొత్తం 2,233 ఎకరాలలో కొబ్బరి సాగు అవుతుండగా సాలీనా 94.92 లక్షల కాయల ఉత్పత్తి జరుగుతున్నది అని ప్రధానముగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,358 ఎకరాలలో మరియు ఖమ్మం జిల్లాలో 586 ఎకరాలలో కొబ్బరి సాగుచేయబడుతున్నదన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తరణ మరియు అభివృద్ధి కార్యకలాపాలను చూసేందుకు హైదరాబాద్‌లో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు కృష్ణా జిల్లాకు మార్చబడింది. ఈ కార్యాలయము అవసరాలకు అనుగుణముగా తెలంగాణ రాష్ట్రంలో సేవలను అందిస్తున్నదని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి సాగుకి అనుకూలమైన సూక్ష్మ వాతావరణ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా, రాష్ట్రంలో అన్నీ జిల్లాలలో ఎక్కడైనా కొబ్బరి సాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొబ్బరి సాగు విస్తరణకు అవసరమైన ప్రోత్సాహము, సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన సలహాలు, ఆర్థిక సహాయం అందించడం మరియు కొబ్బరి మార్కెటింగ్ పరిజ్ఞానం మొదలైన విషయాలలో రైతులకు చేయూత అందించాల్సిన అవసరం ఉన్నందున, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తరణ మరియు అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు తుమ్మల.