నేడు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భారత పార్లమెంటు వ్యవస్థను ప్రధాని మోదీ కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లుండి మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారని.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. పార్లమెంట్ ఎలా ఉండాలని చెప్పేది ఆర్టికల్స్ 79, 84 అని.. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు.
రాష్ట్రపతిని కనీసం శంకుస్థాపనకు కూడా పిలవలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదన్నారు ఉత్తమ్. దేశ చరిత్రలో అతి తక్కువ రోజులు సభకు హాజరైన ప్రధానిగా మోడీ రికార్డులలోకి ఎక్కారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో కొత్త బిల్లులపై అసలు చర్చే ఉండదన్నారు. కీలక చట్టాలను కూడా పది నిమిషాల్లోనే ఆమోదించుకుంటారని ఎద్దేవా చేశారు.