ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ఆయన రాష్ట్రానికి రానున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 28, 29, వచ్చే నెల 2 తేదీలను ప్రధాని పర్యటన కోసం రాష్ట్ర నేతలకు కేటాయించినా అక్టోబరు రెండుకే ప్రాధాన్యమిచ్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
మోదీ పర్యటన అనంతరం అమిత్‌షా, జె.పి.నడ్డాల సభలను రాష్ట్రంలో మరో రెండు ఉమ్మడి జిల్లాల్లో చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నెల 26 నుంచి అక్టోబరు రెండవ తేదీ వరకు 119 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా మూడు మార్గాల్లో బస్సు యాత్రలను చేపట్టాలని పార్టీ తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి వాటిని వాయిదా వేసి .. బస్సు యాత్రల స్థానంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడు, నాలుగు సభలను నిర్వహించాలని నిర్ణయించారు. సభల తేదీలను ఒకట్రెండు రోజుల్లో బీజేపీ నేతలు ఖరారు చేయనున్నారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితాను అక్టోబరు మొదటివారంలో వెల్లడించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లను గుర్తించి… సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.