ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేతపై కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ ఎత్తేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మతపర రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల అమలుపై చార్జీషీట్ పెడదాం అని ఛాలెంజ్ చేశారు.
గ్యారెంటీల గారడీలపై మీరు చార్జీషీట్ వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి రోజుకో దేవుడిపై ఒట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ మరోసారి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని సీరియస్ అయ్యారు. ఇక, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని.. తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడే హక్కు ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.