పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో పౌరసరాఫరాలు, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకుగాను పేదప్రజల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.
కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి కూడా వివరాలు సేకరించారు. అయితే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటివరకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు త్వరలోనే పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించడంతో త్వరలోనే తమకు కార్డులు అందుతాయని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు.