తెలంగాణ రవాణా శాఖ జీరో పొల్యూషన్ పై దృష్టి సారించింది. పెట్రోల్, డీజిల్ ఆటోల నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే కొత్త ఆటోలకు నో ఫర్మిట్ నిబంధన తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహకాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.
రవాణ శాఖ స్క్రాబ్ పాలసీని తీసుకొచ్చింది. గడువు తీరిన ద్విచక్ర వాహనాలు, ట్రాన్స్ పోర్టు వాహనాలు స్క్రాబ్ చేస్తే.. రాయితీలను ప్రకటించింది. మరో అడుగు ముందుకు వేసి జీరో పొల్యూషన్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల 733 ఆటోలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గ్రేటర్ పరిధిలో లక్షన్నర వరకు ఆటోలు రిజిస్ట్రర్ అయ్యాయి. దీంతో పొల్యూషన్ పెరుగుతుందని భావించిన ప్రభుత్వం వాటి నివారణకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది. కొత్తగా కొనుగోలు చేసే వారికి నో ఫర్మిట్ నిబంధన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్ పేట, మెహిదీపట్నం, బండ్లగూడ ఆర్టీవో కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం నో ఫర్మిట్ నిబంధన అమలవుతోంది.