ఏళ్ల తరబడి సాగుతున్న పోడు భూముల వివాదానికి ఎట్టకేలకు తెరపడనుంది. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని ఇంతకుముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం జూన్ 24 నుంచి 30 వరకూ నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. కొత్తగా పోడు పట్టాలు పొందిన వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి, పోడు పట్టాల యాజమానులకు నేరుగా రైతుబంధును జమచేస్తుందని చెప్పారు. నూతనంగా పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ అధికారులకు అందజేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.
పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.