గ్రామాల్లో తాగునీటి నిర్వహణ పంచాయతీలకే – సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలని అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సమీక్ష నిర్వహించారు.

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని అన్నారు. అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ మాత్రమే విడిగా సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ భగీరథలో చేపట్టిన ఇంట్రా విలేజ్ వర్క్స్, ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసే నిర్వహణ ఎవరూ పట్టించుకోవటం లేదని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలో లేదని అధికారులు వివరణ ఇచ్చారు. జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య పెరిగిపోతుందని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version