బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య నిన్న రాజ్య సభ సభ్యుడి పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరుతారని కొందరూ.. కాంగ్రెస్ లో చేరుతారని మరికొందరూ.. సొంతంగా పార్టీ పెడతారని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.
కొత్త పార్టీ పెట్టాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నుంచి తనపై ఒత్తిడి ఉందని స్పష్టం చేశారు ఆర్. కృష్ణయ్య. నాలుగేళ్ల క్రితమే తనకు బీజేపీ లో చేరాలని ఆఫర్ వచ్చిందని.. అప్పుడే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవీ ఇస్తామని చెప్పినట్టు గుర్తు చేశారు. వాస్తవానికి బీజేపీ నేతలు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం వెనుక ఎలాంటి రాజకీయం లేదని వెల్లడించారు ఆర్. కృష్ణయ్య. ప్రధానంగా కొత్త పార్టీ పెట్టడమా..? లేక ఏదైనా పార్టీలో చేరడమా అనే విషయం పై బీసీ సంఘాల నాయకులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ ఇచ్చారు ఆర్.కృష్ణయ్య. మరోవైపు తాజాగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.