కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతా సమానమే అని.. హద్దులు మీరితే ఎవరైనా సరే వారిపై చర్యలు ఉండటం సహజమే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవని అధిష్టానం అందరినీ ఒకేలా చూడాలని.. ఒకే రకమైన చర్యలుండాలని విన్నవించారు. తీన్మార్ మల్లన్న తన హద్దులు దాటి ప్రవర్తించారని ఆయన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం అన్నారు.
మల్లన్న, రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడని.. మరీ ఇప్పుడు అందరిమాదిరిగానే మల్లన్న పై చర్యలు తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. వారు ఇరువురు కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కులగణన సర్వే పై ఆ సర్వేలో ప్రకటించిన బీసీల లెక్కలపై చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులగణన పై చిత్తశుద్దితో ఉన్నారని.. ఆయన కీలక ఆదేశాలతోనే ఈ సర్వే జరిగిందని తెలిపారు.