తెలంగాణ రైతులకు శుభవార్త. రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్‌కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను షురూ చేసింది. ఈ నిధులు ఆర్థికశాఖ ద్వారా బ్యాంకులకు చేరగా సోమవారం నుంచి నేరుగా ఎకరాకు రూ.5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
రాష్ట్రంలో మార్చి 28వ తేదీ నాటికి ప్రభుత్వం 64,75,320 మంది రైతుల ఖాతాల్లో రూ.5,575 కోట్ల రైతుబంధు డబ్బులను జమ చేసింది. తాజాగా మిగిలిన వారికి నిధుల విడుదలను మొదలు పెట్టింది. ఇంతవరకు మొత్తం 1,11,39,534 ఎకరాలకు సాయం అందింది. రాష్ట్రంలో 5 ఎకరాలకు పైగా ఉన్నవారు దాదాపు అయిదున్నర లక్షల మంది. ఇందులో 5 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నవారు 4.4 లక్షలు, 10-24 ఎకరాలు ఉన్నవారు 94,000; 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు 6,488 మంది ఉన్నారు. వీరందరికీ జమ చేసేందుకు మరో రూ.2 వేల కోట్ల మేరకు అవసరమని అధికారులు అంచనా వేశారు.