సూర్యతాపానికి ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు కూడా అల్లాడిపోతున్నాయి. ప్రచండ భానుడి భగభగలకు తెలంగాణ అట్టుడికిపోతోంది. ప్రతిరోజు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. పది జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా.. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 46.6 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో సాధారణం కన్నా సగటున 2.1 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి.
ఇక ఎండవేడిమికి, వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రోజున ఏడుగురు మృతి చెందారు. కొందరు అక్కడికక్కడే కుప్పకూలిపోతే.. మరికొందరు చికిత్స పొందుతూ మరణించారు. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 8 మండలాలు, జగిత్యాలలో 6, కరీంనగర్‌లో 4, సిద్దిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్‌లో 2, జగిత్యాల జిల్లాలో 2 మండలాలతోపాటు ఖమ్మం నగరంలో వడగాలులు వీచినట్లు వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల 5వ తేదీ వరకు వడగాలుల ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.