పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సిఎండిగా ఉన్న శ్రీధర్ నడిమెట్ల జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులు కానున్నారు. ఆ పోస్ట్ కు ఆయన పేరుని సిఫార్సు చేయాలని ఈ శనివారం జరిగిన సమావేశంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు నిర్ణయించింది.
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థకు నేతృత్వం వహించే పోస్టుకు మొత్తం ఏడు దరఖాస్తులు రాగా, వాటిలో నుంచి శ్రీధర్ పేరును ఎంపిక చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖకు సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న సుమిత్ దేబ్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయడంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను అదే సంస్థలో డైరెక్టర్ గా పనిచేస్తున్న అమితవ ముఖర్జీకి అప్పగించారు.