ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు

-

తెలంగాణలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి, విధుల్లో అలసత్వం వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారంలోనే ఒకే రోజు ఆరుగురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు.

మల్టీజోన్‌-1 పరిధిలో ఆరుగురు పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఒక కానిస్టేబుల్‌ ఉన్నారు. అక్రమాలకు పాల్పడటంతో పాటు విధుల్లో అలసత్వం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐజీ తెలిపారు.

సస్పెండ్‌ అయిన వారిలో  హైదరాబాద్‌ పంజాగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డుప్రమాదానికి కారకుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌కు సహకరించిన బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.డి.ప్రేమ్‌కుమార్‌ ఉన్నారు. మరోవైపు నిజామాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ మద్యం సేవించి పోలీస్‌స్టేషన్‌కు రావడమే కాకుండా ఠాణా సిబ్బందిని ఇబ్బందులకు గురి చేసినట్లు తేలడంతో సస్పెండ్‌ చేశారు.

జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ ఠాణా పరిధిలో నమోదైన గంజాయి కేసు దర్యాప్తులో అలసత్వంగా వ్యవహరించినందుకు ఎస్సైలు జి.మనోహర్‌రావు, ఎ.తిరుపతి, హెడ్‌కానిస్టేబుల్‌ బి.రవీందర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ టి.నరేందర్‌లపై సస్పెన్షన్ వేటు పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version