తెలంగాణలో భక్తులకు శుభవార్త. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రోజూ 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
ఇందులో 200 స్పర్శ దర్శనం, 500 అతి శీఘ్రదర్శనం, మరో 500 శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఈ నిర్ణయం త్వరలో అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. స్పర్శదర్శనం టికెట్ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.150 ఉంటుందని ఆర్టీసీ వర్గాలు వివరించాయి.
హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్‌లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్‌ఎం శ్రీధర్ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ – శ్రీశైలం ఏసీ బస్సులు వారం రోజుల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. పెద్దలకు జేబీఎస్ నుంచి రూ.750, పిల్లలకు రూ.540. ఎంజీబీఎస్ నుంచి రూ.700, రూ.510గా ఛార్జీలను ఖరారు చేశారు.