హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్టేషన్‌లో ఈనెల 15వ తేదీన ఓ మహిళను అర్ధరాత్రి వేళ ఠాణాలో ఉంచి లాఠీలతో కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాచకొండ సీపీలను గవర్నర్ ఆదేశించారు. బాధిత మహిళ ఇంటికి వెళ్లి అవసరమైన వెద్య సదుపాయాలు అందించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీని ఆదేశించారు.
ఇదీ జరిగింది.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి వేళ ఎల్బీనగర్‌లో స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ.. ముగ్గురు మహిళలను.. పోలీసులు ఠాణాకు తీసుకొచ్చారు. తమను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించిన మహిళపై.. కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత లాఠీతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో.. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.