తెలంగాణలో త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

-

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ కమిషన్ ప్రక్షాళన దిశగా చర్యలకు ఆదేశించారు. మరోవైపు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లపైనా కసరత్తు చేస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు.

ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం రోజున శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు వెల్లడించారు. త్వరలోనే 14వేల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి సంఘాలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version