సాగర్‌ నీళ్ల వివాదం.. ఏపీపై కేఆర్ఎంబీకి  తెలంగాణ ఫిర్యాదు

-

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దిగువన విద్యుత్‌ ఉత్పత్తి కోసం నిర్మించిన టెయిల్‌ పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ నెల 12వ తేదీన టెయిల్‌ పాండ్‌లో నిల్వ ఉన్న ఏడు టీఎంసీలలో నాలుగు టీఎంసీలను దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు ఏపీ అధికారులు విడుదల చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. టెయిల్‌ పాండ్‌లో ఉన్న నీటిని ఏపీ తరలించుకోవడంపై జెన్‌కో అధికారుల నుంచి వివరాలు సేకరించిన నల్గొండ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు.. ఈ నెల 15న ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేఆర్ఎంబీ స్పందించాల్సి ఉంది.

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం గరిష్ఠాలకు చేరినప్పుడు సాగర్‌ నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే నీటిని టెయిల్‌పాండ్‌కు తరలించి..తిరిగి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా  సాగర్‌లోకి ఎత్తిపోసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించిన విషయం తెలిసిందే. సాగర్‌ నుంచి 21 కిలోమీటర్ల పొడువునా ఈ టెయిల్‌ పాండ్‌ ఉంది. దీని నిర్వహణను తెలంగాణ జెన్‌కో పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది సాగర్‌లో తగినంత నీటి నిల్వ లేకపోవడంతో జల విద్యుత్‌ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version