తెలంగాణలో గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయంటూ ఇటీవల టీజీఐఐసీ ప్రకటన జారీ చేయడంతో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం కాస్తా హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ అంశంలో ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకునేందుకు వీలు లేదని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయి.
ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల అంశంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏఐ సాయంతో కొంతమంది నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేశారంటూ పిటిషన్‌లో పేర్కొంది. 400 ఎకరాలకు సంబంధించి నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్‌లు సృష్టించారని.. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు వీడియోలు క్రియేట్ చేశారని తెలిపింది. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి పరిస్థితులను మరింత క్లిష్టతరం చేశారని వెల్లడించింది. ఈ ఫేక్ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం కోరగా.. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.