ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 400 ఎకరాల హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానివేనని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. దీన్ని ఖండిస్తూ ప్రతిపక్షాలు, హెచ్‌సీయూ విద్యార్థులు నిరసన గళమెత్తారు. వారికి మద్దతుగా ఇతర యూనివర్సిటీల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు పార్లమెంటుకు చేరింది.
హెచ్‌సీయూ భూముల వివాదంపై తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ లక్ష్మణ్ ఈ విషయాన్ని లేవనెత్తారు. 400 ఎకరాల హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూముల అమ్మకానికి సిద్ధమైందని సభకు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయానికి కూటాయించిన భూములను కాపాడాలని కోరారు.
యూనివర్సిటీకి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లోనూ తెలంగాణ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులంతా మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి ఈ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.