తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థి, మంత్రివర్గం కూర్పుపై చర్చలు జరుపుతోంది. ఈ చర్చల ఫలించిన తర్వాత సీఎం, మంత్రివర్గాన్ని ప్రకటించనుంది. మొదట సోమవారం రోజున సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పినా.. పార్టీ సీఎం అభ్యర్థి విషయంలో స్పష్టతకు రాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఆరు లేదా తొమ్మిదో తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేసులో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉండగా రేవంత్, భట్టి మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు తెలిసింది. సీఎం, డిప్యూటీ కాకుండా 16 మంత్రులకు అవకాశం ఉంటుంది. అయితే సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రిగా అవకాశం ఉన్న వారు వీరే
- ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమసాగర్‌రావు, నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి
- కరీంనగర్ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి
- మెదక్ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా
- మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ, శంకర్
- రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామమోహన్‌రెడ్డి
- నల్గొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పద్మావతి
- వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ
- ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
- షబ్బీర్‌అలీని మంత్రివర్గంలోకి తీసుకొని మండలికి పంపుతారనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు తుమ్మల పేరును స్పీకర్ స్థానానికి పరిశీలించే అవకాశం లేకపోలేదని సమాచారం.