సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈరోజు కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ తర్వాత గాంధీ భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రకాశం హాలులో జరగనున్న టీపీసీసీ మండల, బ్లాక్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు హాజరు కానున్నారు.
అదే విధంగా సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ఇందిరా భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీపీసీసీ పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, మంత్రులు పాల్గొంటారు. ఈ సమావేశానికి ఏఐసీసీ నేత మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరవుతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
మరోవైపు ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు.