తెలంగాణలో రెండ్రోజుల నుంచి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం రోజున భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలతో చాలా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఇక ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తుండటంతో మామిడి, నిమ్మ పంటలు నేల రాలాయి.
అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అధికారులు కొన్ని జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు బలంగా వీచే ఛాన్స్ ఉందని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.