తెలంగాణ ఏర్పాటు ప్రజలకు ఎంత సంతోషాన్ని కలిగించిందో… వరంగల్ డిక్లరేషన్ కూడా తెలంగాణ ప్రజలకు అంతే సంతోషాన్ని కలిగిస్తుందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని.. ఓయూలో పర్మిషన్ ఇవ్వం, జైలుకు కూడా వెళ్లనీయం అంటూ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతుల్ని ఏవిధంగా ఆదుకోబోతోందనే విషయాన్ని వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలియజేయబోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ వేదికగా వరంగల్ డిక్లరేషన్ ద్వారాా నూతన వ్యవసాయ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 శాతం రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఓయూకు అనుమతించలేదు, చంచల్ గూడ జైలులో ములాఖత్ కు పర్మిషన్ ఇవ్వలేదు… ఈ విధంగా అధికార పార్టీ శునకానందాన్ని పొందుతున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహరావు, మర్రిచెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి వంటి వారు వచ్చిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని… ఎన్నో ఉద్యమాలకు వేదిక అయిందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ చావుతెలివి తేటలు అమలు చేస్తుందని విమర్శించారు.