తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే చాలు భయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్మం, చిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల ఇద్దరు నాలాలో పడి మరణించగా.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది.