తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్, సిరీస్‌లు మార్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ‘‘టీఎస్’’తో కొనసాగిన వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 15వ తేదీ నుంచి ‘‘టీజీ’’ కోడ్‌తో జరుగుతున్నాయి. టీజీ కోడ్‌తో పాటు ప్రతి జిల్లాలో మొదటి 10వేల నంబర్ల వరకు ‘‘ఏబీ’’ వంటి సిరీస్ లేకుండా నేరుగా సంఖ్య కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు టీజీ కోడ్‌తో ఫ్యాన్సీ నంబర్ పొందేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
టీజీ కోడ్కు క్రేజ్ బాగా పెరగడంతో రవాణా శాఖకు ఆదాయం పెరిగింది. ముఖ్యంగా ఖమ్మం, వైరా, సత్తుపల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నంబర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో జిల్లాకు రూ.14,94,602 ఆదాయం సమకూరినట్లు సమాచారం. ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకునేందుకు వాహనాదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర ముఖ్య తేదీలు వాహనం నంబర్‌గా వచ్చేలా వేలం పాడుతూ లక్షల డబ్బును చెల్లిస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి టీజీ కోడ్, సిరీస్ అమల్లోకి వచ్చిన ఈనెల 15 (తొలిరోజు)న జిల్లా రవాణా శాఖకు రూ.6,07,965 ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.