కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ప్రతీ ఊరిలో, గుడిలో జమ్మిచెట్టు నాటే కార్యక్రమం

-

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం రెండో యేడాదిలోకి అడుగుపెట్టింది. అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎం.పీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి లతో కలిసి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో జమ్మి మొక్కలు నాటి రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు.

దసరా పండగ సందర్భంగా అన్ని గ్రామాలు, గుడుల్లో కలిపి లక్షా ఇరవై వేల జమ్మి మొక్కలను నాటేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం గుర్తించింది. అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని తీసుకున్నామని సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అటవీ, దేవాదాయ శాఖలకు ఎంపీ కృతజ్జతలు తెలిపారు.

తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం ఎంపీ సంతోష్ కుమార్ తీసుకోవటాన్ని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుడుల్లో జమ్మి చెట్టు నాటి, పెంచేలా దేవాదాయ శాఖ ద్వారా చొరవ తీసుకుంటున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version