రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు వచ్చిన వరి పైరు నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీటి పాలైపోతుందేమోనని భయపడుతున్నారు.
మరోవైపు భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన వానతో కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం బండౌతాపురం గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వరంగల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారు బండౌతాపురానికి చెందిన బాలగాని హరికృష్ణ, అతడి బంధువులు సాయి, కిట్టుగా గుర్తించారు. పండుపూట యువకుల మరణంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా పడుతున్న వానకు జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్డుపైకి చేరి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.