త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు జరుపుకొనే బక్రీద్ పర్వదినం కోసం హైదరాబాద్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘనటలు, అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం రోజున నగరంలోని ప్రత్యేక ప్రార్ధనలు జరిగే మీరాలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించనున్నారు.
పాత బస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు. బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నట్లు వివరించారు. జూ పార్కు, మసీద్ అల్హా హో అక్బర్ ఎదురుగా వారి వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.