గతేడాది ట్రాఫిక్‌ ఉల్లంఘనలు గంటకు 1,731

-

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది. ఎన్ని జరిమానాలు విధిస్తున్నా.. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా వాహనదారులు మాత్రం ఉల్లంఘనలకు పాల్పడటం ఆపడం లేదు. జరిమానాలు జరిమానాలే.. ఉల్లంఘనలు ఉల్లంఘనలే.. అన్నట్లుంది రాష్ట్రంలో వాహనాలు నడిపేవారి పరిస్థితి.

గతేడాది గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి గంటకూ 1,731 చొప్పున ట్రాఫిక్‌ ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి, జరిమానా విధించడం సులభమవ్వడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2023లో రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 1,51,63,986 కేసులు నమోదయ్యాయి. వీటికి  రూ.519 కోట్ల జరిమానా విధించారు. అంటే సగటున రోజుకు 41,544 ఉల్లంఘనలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. వీటికి రూ.1.42 కోట్ల వరకు జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు.

అయితే చాలా మంది వాహనదారులు జరిమానా చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నారు కానీ ట్రాఫిక్‌ నిబంధనలు మాత్రం పాటించడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంద మందిలో ఒక్కరు నిబంధనలు పాటించకపోయినా దాని ప్రభావం మిగతావారిపై పడుతోందని అందుకే నిబంధనలు ఉల్లంఘించే వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు పెడుతుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version