గ్రూప్‌-2 షెడ్యూలు ప్రకారం జరిగేనా.. వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం

-

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల షెడ్యూల్ ప్రస్తుతం నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తోంది. తాజాగా గ్రూప్‌-2 రాతపరీక్ష షెడ్యూలు ప్రకారం జరుగుతుందా? లేదా మరోసారి వాయిదా పడుతుందా? అనే విషయమై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్‌-2 పరీక్షను 2024-జనవరిలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ మొదలుపెట్టింది.

గ్రూప్‌-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేయగా.. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూలు జారీ చేయగా.. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేయగా ఎన్నికలు ఉన్నందున మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేక మళ్లీ వాయిదా పడతాయా అనే విషయంపై మరో వారంలో స్పష్టత రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version