టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. గ్రూప్-1 క్వశ్చన్ పేపర్ కాజేసిన టీఎస్పీఎస్సీలోని పలువురు ఉద్యోగులు పరీక్ష రాయడంలో తమ దొంగ తెలివిని ప్రదర్శించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కువ మార్కులు సాధిస్తే అనుమానం వస్తుందని భయపడి.. సాధారణ మార్కులతో సరిపెట్టుకునేలా ప్రయత్నించారు.
క్వశ్చన్ పేపర్లను ముందుగానే చేజిక్కించుకున్న ప్రవీణ్, రాజశేఖర్‌లు మొదటి నుంచీ పక్కా పథకం ప్రకారమే నడుచుకున్నారని సిట్ అధికారులు గుర్తించారు. 103 మార్కులు తెచ్చుకున్న ప్రవీణ్.. తన వ్యక్తిగత వివరాలు నింపే పత్రంలో డబుల్ బబ్లింగ్ చేయడం కూడా దీనిలో భాగమేనని అంచనా వేస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు 20 మంది రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో షమీమ్, సురేష్, రమేష్‌లకు వందకుపైగా మార్కులు వచ్చాయి. ఈ ముగ్గురూ ప్రవీణ్, రాజశేఖర్‌ల ద్వారా ప్రశ్నపత్రాన్ని ముందుగానే పొందారన్న ఆరోపణపై సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. క్వశ్చన్ పేపరు తెలిసినందున వీరికి 150కి 150 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే దొరికిపోతామన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ మార్కులు వచ్చేలా రాశారని పోలీసులు భావిస్తున్నారు.